విద్యార్థినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఇటలీలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ఆ దేశంలో విమర్శలకు దారి తీసింది. ఈ కేసులో నిందితుడు కేవలం 10 సెకన్ల కంటే తక్కువ సమయమే ఆ విద్యార్థిని తాకడని పేర్కొంటూ అతడిని నిర్దోషిగా తేల్చింది.
రోమ్‌కు చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థిని.. స్కూల్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న 66 ఏళ్ల ఆంటోనియో అవోలా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గతేడాది ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసింది.తన వెనుక భాగంపై చేతులతో తడిమి.. తన లోదుస్తులను కిందకు లాగేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆంటోనియోపై కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో విచారణ జరగ్గా.. ఆ విద్యార్థినిని తాను తాకడం నిజమేనని అతడు అంగీకరించాడు. అయితే తాను సరదాగానే అలా చేశానని కోర్టుకు తెలిపాడు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తాజాగా అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది.
‘‘కామవాంఛతో తాను ఈ పనిచేయలేదని, కేవలం సరదాగా చేసినట్లు నిందితుడు చెప్పిన వాదనను మేం అంగీకరిస్తున్నాం. అంతేగాక.. బాలికను అతడు కేవలం 5 నుంచి 10 సెకన్ల లోపు మాత్రమే తాకాడు. కాబట్టి దీన్ని నేరంగా పరిగణించడం అనాలోచితమే అవుతుంది’’ అన్న కోర్టు వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.