మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలను వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా’ తుపాను ఆ ఇరు దేశాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం రోజున ఈ దేశాల తీరం వెంబడి పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. గంటకు గరిష్ఠంగా దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
మోచా ప్రభావంతో సమీప విమానాశ్రయాలను బంగ్లాదేశ్ మూసివేసింది. పెద్దసంఖ్యలో చెట్లు కూలిపోగా, పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలువురు గాయపడ్డారు. బంగ్లాదేశ్లో 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటుచేయగా.. శనివారం నుంచి ఇప్పటిదాకా 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ రోహింగ్యాలు నివసిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరానికి తుపాను ముప్పు పొంచి ఉందని అధికారులు ముందే హెచ్చరించారు.
కాక్స్ బాజార్ (బంగ్లాదేశ్), క్యాక్ఫ్యూ (మయన్మార్)ల మధ్య తుపాను తీరాన్ని దాటింది. ఇటు పశ్చిమ బెంగాల్లోనూ సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు మేదినీపుర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధం చేశారు.