ప్రధాని మోదీ మూడ్రోజులుగా అమెరికాలో పర్యటించారు. ఆయనకు అక్కడి ప్రవాస భారతీయులతో పాటు అధ్యక్ష దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ ఇవాళ ఈజిప్టు చేరుకోనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు రెండు రోజులపాటు మోదీ అక్కడ పర్యటించనున్నారు.
1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించడంతో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. సుమారు 4వేల మంది సైనికులు అప్పట్లో పోరాటంలో పాల్గొని చనిపోయారు. వారి కోసం హెలియోపొలిస్ కామన్‌వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకం నిర్మించారు. వాస్తవానికి తొలుత నిర్మించిన స్మారకాన్ని 1970లో జరిగిన ఇజ్రాయెల్-ఈజిప్టు యుద్ధ సమయంలో ధ్వంసం చేశారు. ఆ తర్వాత మళ్లీ నిర్మించారు. దీంతోపాటు అతి పురాతన అల్ హకీమ్ మసీదునూ మోదీ సందర్శిస్తారు.