రష్యా అధ్యక్షుడు పుతిన్ మెత్తబడ్డారా.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే యోచనలో ఉన్నారా.. ఉక్రెయిన్‌తో చర్చలకు సై అంటున్నారా.. అంటే అవుననే అంటున్నారు తుర్కీయే అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్దొగాన్. “ఆశ లేకుండా అయితే లేం” అని ఆయన వ్యాఖ్యానించారు.
అజర్‌బైజాన్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన ఓ వార్తాపత్రికతో మాట్లాడుతూ చర్చలకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై మాస్కో స్పందించింది. చర్చలకు పుతిన్ ఆరంభం నుంచి సిద్ధంగా ఉన్నారని, ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించకముందు కూడా చర్చల ప్రతిపాదన చేశారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ గుర్తు చేశారు. ఈ విషయంలో ఉక్రెయినే తమ విధానాన్ని మార్చుకుందని విమర్శించారు.
మరోవైపు కీవ్, ఇతర నగరాలను అల్లాడిస్తున్న ఆత్మాహుతి డ్రోన్లను సరఫరా చేసిన ఇరాన్‌పై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా తాజాగా మరోసారి మండిపడింది. ఈ డ్రోన్ల నిర్వహణలో రష్యన్లకు ఇరాన్ సైనిక సిబ్బంది శిక్షణ ఇస్తున్నారని పేర్కొంది.