మన దేశంలో కోవిడ్ టీకాలను వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఇతర దేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. విదేశాల్లో వ్యాక్సిన్లను తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో అమెరికా ఇప్పటికే టీకా తీసుకున్న వారికి బీర్, బేకరీ ఐటమ్స్ ను గిఫ్టులుగా ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టీకాలు తీసుకునేందుకు కొంత మేర స్పందన కనిపించింది. అయితే ఇప్పుడు అమెరికా బాటలోనే యూకే కూడా వెళ్తోంది. అక్కడ కోవిడ్ టీకాలు ఇచ్చేందుకు డేటింగ్ యాప్స్ సహాయం తీసుకుంటున్నారు.
బ్రిటన్‌లో టిండర్, మ్యాచ్, హింగ్ వంటి కంపెనీలు డేటింగ్ యాప్ ల ద్వారా సేవలు అందిస్తున్నాయి. అక్కడ డేటింగ్ యాప్‌లకు బాగానే ఆదరణ ఉంది. ఇక చాలా మంది టీకా తీసుకున్న వారితోనే డేటింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని డేటింగ్ యాప్స్ ద్వారా కోవిడ్ టీకాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతోంది.
డేటింగ్ యాప్స్ ద్వారా టీకాలపై ప్రచారం చేస్తే ఎక్కువ మంది టీకాలు వేయించుకుంటారని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే డేటింగ్ యాప్‌ల ద్వారా టీకాలపై ప్రచారం చేయనున్నారు. టీకాలు తీసుకుంటే కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించనున్నారు. కాగా బ్రిటన్‌లో 1 కోటి మంది డేటింగ్ యాప్‌లను తరచూ వాడుతుంటారని ఓ సర్వేలో వెల్లడైంది. అలాగే ఇప్పటి వరకు అక్కడ 40.3 మిలియన్ల మందికి తొలి కోవిడ్ డోసును ఇచ్చారు.