ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఐపీఎల్ వేసవిలో క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. గతేడాది కరోనా వల్ల ఐపీఎల్‌ను వాయిదా వేసినా సెప్టెంబర్ నెలలో నిర్వహించారు. కానీ ఈసారి మన దేశంలోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఐపీఎల్ అనగానే ముందుగా మనకు బెట్టింగ్ గుర్తుకు వస్తుంది. బెట్టింగ్ రాయుళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినంత సేపు ఆ ప్రపంచంలో మునిగి తేలుతారు. రూ.వందలు, వేలు మొదలుకొని రూ.లక్షలు, కోట్లలో బెట్టింగ్‌లు వేసే వారు కూడా ఉంటారు. అయితే ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ మాఫియా మళ్లీ తెర మీదకు ఎలాగూ వస్తుంది కనుక పోలీసులు వారి ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు.
ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌లు జరగడం అనేది సర్వసాధారణం. ప్రతి ఏటా చాలా మంది బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ బెట్టింగ్‌లు ఆగడం లేదు. అయితే ఈసారి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల బెట్టింగ్ రాయుళ్లకు చుక్కలు కనిపించడం ఖాయమేననిపిస్తోంది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతాయి కనుక పోలీసులు అనేక విధాలుగా నిఘా పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మ్యాచ్‌లో ఫలానా బ్యాట్స్‌మన్ ఫలానా పరుగులు చేసి ఔట్ అవుతాడని కొందరు, కాడని కొందరు, ఫలానా టీమ్ గెలుస్తుందని కొందరు, ఫలానా బౌలర్ ఇన్ని వికెట్లు తీస్తాడు అని కొందరు.. బెట్టింగ్‌లు వేస్తుంటారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ రాయుళ్ల చేతుల్లో కొన్ని కోట్ల రూపాయలు మారుతుంటాయి. ఇక కరోనా వల్ల ఈసారి చాలా మంది టీవీలు, డిజిటల్ మాధ్యమాల్లో ఎక్కువగా ఐపీఎల్‌ను వీక్షిస్తారు కనుక.. బెట్టింగ్ కూడా జోరుగా కొనసాగుతుందని సమాచారం. మరి పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..!