ఐఆర్సీటీసీ టూరిజం శ్రీరామాయణ యాత్రను ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) 18 రోజుల పాటు శ్రీ రామాయణ యాత్ర పేరుతో సాగే ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్‌ను జూన్ 21న ప్రారంభించనుంది. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న పవిత్ర పుణ్యస్థలాలను యాత్రికులు సందర్శించేలా ఈ శ్రీరామాయణ యాత్ర ట్రైన్ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు బుధవారం తెలిపారు.
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా రామాయణ సర్క్యూట్‌లో యాత్ర సాగేందుకు వీలుగా బుకింగ్స్ ప్రారంభించినట్టు ఐఆర్సీటీసీ లక్నో చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ యాత్ర ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో జూన్ 21న ప్రారంభమవుతుందని వివరించారు. ఈ 18 రోజుల యాత్రకు తీసుకెళ్లే ట్రైన్‌లో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఇందులో 600 మంది ప్రయాణం చేయొచ్చు. ఒక్కో ప్రయాణికుడికి రూ. 62,370 ఖర్చు అవుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. భగవాన్ శ్రీరాముడు, ఆయన సతీమణి సీతమ్మ తల్లి 14 ఏళ్లు వనవాసం చేస్తూ అడుగుమోపిన ఆయా ప్రాంతాలను సందర్శించాలన్న భక్తుల కలను నెరవేర్చేందుకు ఈ టూర్ ప్యాకేజీ రూపొందించినట్టు తెలిపారు.
స్వదేశ్ దర్శన్ స్కీమ్ పరిధిలో గుర్తించిన రామాయణ్ సర్క్యూట్ ద్వారా ఈ ట్రైన్ సాగుతుంది. అయోధ్య, జనక్‌పూర్ (నేపాల్), సీతామర్హి, బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, శ్రింగ్వేర్‌పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కంచీపురం, దక్షిణ భారతపు అయోధ్యగా పేరుపొందిన భద్రాచలం తదితర ప్రాంతాల గుండా ఈ యాత్ర సాగుతుంది. మొదటిసారిగా ఓ టూరిస్ట్ ట్రైన్ భారత్ నేపాల్‌ను కలుపుతూ అయోధ్య, జనక్‌పూర్ ప్రాంతాలను అనుసంధానం చేస్తోందని సిన్హా వెల్లడించారు.