తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని తమకు ఎవరితో పొత్తు ఉండదని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. ఇక ఈ మధ్య తెలంగాణలో టీడీపీ యాక్టివ్ కావడంతో, ఆ పార్టీతో బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారం మొదలైంది. అయితే ఈ అంశంపై బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు..ఎట్టి పరిస్తితులోనూ టీడీపీతో పొత్తు ఉండదని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ వచ్చారు. ఒంటరిగానే పోటీ చేస్తామని కింది స్థాయి శ్రేణులకు చెప్పాలని నాయకులకు సూచించారు.
అయితే ఒంటరి పోరు అనేది బీజేపీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది..అలాగే టీడీపీ సపోర్ట్ ఉంటే ఎంతవరకు మేలు జరుగుతుందనే అంశాలపై కొందరు బీజేపీ నేతలు లోతుగా విశ్లేషించుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతున్న మాట వాస్తవమే కానీ…గెలిచెంత బలం ఆ పార్టీకి రాలేదని తెలుస్తోంది. గట్టిగా చూసుకుంటే ప్రస్తుతం వస్తున్న సర్వేల బట్టి చూస్తే బీజేపీకి ఓ 30 లోపు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 60కి మరో 30 సీట్లు దూరంగా ఉంది.
ఆ సీట్లు రావాలంటే బీజేపీ ఇంకా బలపడాలి. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇంకా వీక్ అవ్వాలి. అది జరగడం అనేది కాస్త కష్టమైన పని. కాకపోతే బీజేపీ పుంజుకోవాలంటే టీడీపీ సపోర్ట్ కావాలనే విశ్లేషణలు వస్తున్నాయి. నిజానికి తెలంగాణలో టీడీపీకి రెండు, మూడు సీట్లు గెలిచే బలం కూడా లేదు. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ పార్టీ కొన్ని స్థానాల్లో గెలుపోటములని తారుమారు చేయగలదు.
ముఖ్యంగా టీడీపీ ఓట్లు చీలిస్తే బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ ఓట్లు బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది..అంటే అప్పుడు పొత్తు ఉండాలి. మరి చూడాలి బీజేపీ ఒంటరిగానే బరిలో ఉంటుందో లేక టీడీపీతో కలిసి ముందుకెళుతుందో.