చిన్నపిల్లలకు కాటుక పెట్టడం మంచిదేనా..? వైద్యులు ఏం అంటున్నారు..

-

చిన్నపిల్లలకు కాటుక పెట్టడం హిందూ సంప్రదాయం. హిందువులే కాదు దాదాపు అందరూ పెట్టేస్తుంటారు. చిన్నపిల్లలకు స్నానం చేయించి కళ్లకు, ఐబ్రోస్‌కు, నుదిటిమీద ఇలా మొత్తం కాటుకతో నింపేస్తారు. దీనికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి దిష్టి తగలొద్దు అని రెండోది ఐబ్రోస్‌కు చిన్నప్పుడే మంచిగా కాటుక పెడితే జుట్టు బాగా వస్తుంది, కళ్లకు చలవచేస్తుందని పెద్దలు అంటుంటారు. రోజుల వయసున్న శిశువుకు కూడా కాటుక పెడతారు. కానీ నవజాత శిశువుకు కాటుక పెట్టడం సురక్షితమేనా..? దీనిపై నిపుణులు ఏం అంటున్నారు.

కాటుక ఉపయోగించడం వల్ల శిశువులకు మేలు జరుగుతుందని పెద్దలు అంటారు. కానీ వైద్యులు మాత్రం ఆ విషయంతో ఏకీభవించడం లేదు. ఎందుకంటే కాటుక తయారీలో సీసం ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లల కళ్ళలో దురద, చికాకు వంటివి వస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా కలిగే అవకాశం ఉంది. దుకాణాలలో కొనుగోలు చేసే కాటుకలలో చాలా వరకు సీసంతో నిండి ఉంటాయి. ఇవి పిల్లలకు పెట్టడం మంచిది కాదని వైద్యులు అంటుున్నారు.

ఇంట్లో తయారు చేసేవి వాడొచ్చా..?

ఇంట్లో తయారు చేసే కాటుకలను వాడేవారు కూడా ఉన్నారు. కానీ ఇవి కూడా మంచిదే అని చెప్పే శాస్త్రీయ అధ్యయనాలు ఏం లేవు. కాటుక ఎలా తయారు చేసినా అందులో కార్బన్ ఉండే అవకాశం ఉంది. బయట దొరికే కాటుకలో అధికంగా బొగ్గుతో తయారుచేసినవే ఉంటాయి. బొగ్గు, కొబ్బరి నూనె ఉపయోగించి వాటిని తయారు చేస్తూ ఉంటారు. అలాంటి కాటుకను పిల్లలకు పెట్టడం మంచిది కాదు.

చేతులు శుభ్రంగా లేకుండా చిన్నపిల్లల కళ్ళకు కాటుక పెట్టడం వల్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు కళ్ళల్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి కళ్ళకు కాటుక పెట్టకపోవడమే మంచిది. దిష్టి తగలకుండా పిల్లలకి కాటుక పెట్టాలనుకుంటే చెవుల వెనక, అరికాలి మీద, నుదుటిమీద పెట్టడం ఉత్తమం. శిశువుకు స్నానం చేసేటప్పుడు ఆ కాటుకను తడిగుడ్డతో మెత్తగా మృదువుగా తుడవాలి. లేకుంటే అది చర్మపు కణాల్లో ఇంకిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాటుకను తుడవకుండా ఎక్కువ కాలం పాటు వదిలేయకూడదు. శిశువుల చర్మం, మన చర్మం కన్నా చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకు వాడే ఉత్పత్తులన్నింటినీ సురక్షితమో కాదు నిర్ణయించుకున్నాకే వాడాలి. ఆచారాల వెనకపడి అనవసరపు సమస్యలను తెచ్చుకోకండి.!

Read more RELATED
Recommended to you

Latest news