మాజీ మంత్రి, భూమా నాగిరెడ్డి గారాల పట్టి.. భూమా అఖిలప్రియ సెంట్రిక్‌గా కర్నూలు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఆది నుంచి కూడా అఖిల ప్రియ పొలిటికల్ ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న విషయం తెలిసిందే. తన తండ్రి మరణంతో మంత్రి పీఠాన్ని అధిరోహించిన అఖిల.. తర్వాత జిల్లా రాజకీయాల్లో మరీముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తాము తప్ప మరెవరూ రాజకీయాలు చేయరాదు. అనే వ్యూహంతో సొంత పార్టీలోనే కయ్యాలు పెట్టుకుని ముందుకు సాగిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే గతంలోనే తన కుటుంబానికి మిత్రుడు, తన తండ్రికి మంచి స్నేహితుడు అయిన ఏవీ సుబ్బారెడ్డితో ఢీ అంటే ఢీ అనేలా అఖిల ప్రియ వ్యవహరించారు.
అయితే, గత ఎన్నికల్లో ఓడిపోయిన అఖిల.. అప్పటి నుంచి నియోజకవర్గాలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో ఆమె చేస్తున్న దూకుడు రాజకీయాలకు అంతే రేంజ్‌లో ఇటు సొంత పార్టీ నుంచి అటు ప్రత్యర్తి పార్టీ వైసీపీ నుంచి కూడా వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి. అఖిలప్రియపై ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారనే ముద్ర వేసేలా. నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలు.. శిల్పా చక్రపాణి, శిల్పా రవిచంద్రారెడ్డిలు కూడా అఖిల ప్రియపై ఖస్సు మంటున్నారు.
ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన వైసీపీ నేత హత్య వెనుక అఖిల ప్రియ ఫ్యాక్షన్ రాజకీయం ఉందని రవిచంద్రారెడ్డి ఘాటుగానే విమర్శించడం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. దీనికి ముందు కూడా అఖిల ప్రియ కుటుంబంపై.. కేసులు ఉన్నాయి. ఏబీ సుబ్బారెడ్డిని హత మార్చేందుకు ప్రణాళిక వేసుకున్నారన్న ఫిర్యాదుతో అఖిల ప్రియ భర్తపై పోలీసులు అరెస్టు కు ప్రయత్నించడం కొన్నాళ్ల కిందట వివాదానికి దారితీసింది. ఈ మొత్తం ఘటనలతో అఖిల సెంట్రిక్‌గా ఆమెను ఫ్యాక్షన్ రాజకీయాలకు ముడిపెట్టాలనే ప్రయత్నం సాగుతుండడం రాజకీయంగా జిల్లాలో పెనుసంచలనంగా మారింది.
అయితే, ఇంత జరుగుతున్నా.. టీడీపీ తరఫున అఖిల ప్రియకు మద్దతు లేకపోవడం గమనార్హం. దీనికి కారణం… ఆమె స్వయంకృతమే నని అంటున్నారు పరిశీలకులు. దూకుడు రాజకీయాలు.. సొంత పార్టీ నేతలతోనే కయ్యానికి కాలుదువ్వడం, నియోజకవర్గాల్లో తానే మహారాణి అన్నట్టుగా వ్యవహరించడం.. వంటివి సొంత పార్టీలోనే అఖిలను దూరంగా పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఫ్యాక్షన్ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. కీలక నేతలు అందరూ మౌనంగా ఉన్నారని అంటున్నారు. మరి మున్ముందు.. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో.. చూడాలి.