ఆ వైసీపీ నేత రాజ‌కీయం ముగిసిందా…!

-

ఏపీలో వైసీపీలో కీల‌క నేత‌, కీల‌క ప‌ద‌విలో ఉన్న ఓ సీనియ‌ర్ నేత రాజ‌కీయ‌నికి డోర్లు మూసేస్తున్నారా ?  ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న జంపింగ్ రాజ‌కీయాల‌తో స‌ద‌రు నేత ఫ్యూచ‌ర్ డోల‌యామానంల ప‌డిందా ? అంటే అవున‌నే చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. విశాఖ న‌గ‌ర రాజ‌కీయాల్లో ద్రోణంరాజు కుటుంబానికి మంచి పేరు ఉంది. దివంగ‌త ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న త‌న‌యుడు శ్రీనివాస్ తండ్రి వార‌స‌త్వం అంది పుచ్చుకుని రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలోనే ఉన్న ఆయ‌న ఎన్నిక‌ల వేళ వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుని విశాఖ ద‌క్షిణం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.

ఎన్నిక‌ల్లో ఓడినా శ్రీనివాస్‌కు జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి కీల‌క‌మైన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ( వీఎంఆర్డీఏ) చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌గ‌ర రాజ‌కీయాల్లో దూకుడుగా ఉంటున్నారు. త‌న ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌టిష్టం చేసేందుకు త‌న వంతుగా కృషి చేయ‌డంతో పాటు టీడీపీపై గ‌ట్టిగా పోరాడుతున్నారు. అయితే తాజాగా శ్రీనివాస్‌పై టీడీపీ నుంచి గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ ఫ్యాన్ కింద‌కు చేరారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న్ను యేడాది కాలానికే నియ‌మించ‌గా ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌య్యింది.

ఇప్పుడు న‌గ‌ర రాజ‌కీయాల్లో మంత్రి అవంతి హ‌వా న‌డుస్తోంది. ఇక ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో వాసుప‌ల్లి హ‌వా మొద‌లు కావ‌డంతో పాటు ఇక్క‌డ ప‌నులు అన్ని పార్టీ మారిన ఆయ‌న చెప్పిన‌ట్టుగానే జ‌రిగే ఛాన్సులు ఉండ‌డంతో శ్రీనివాస్ డ‌మ్మీ నేతగా మారిపోయారు. జ‌గ‌న్ శ్రీనివాస్‌కు వీఎంఆర్డీఏ ప‌ద‌వి రెన్యువ‌ల్ చేయాల‌నుకుంటున్నా పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో ప‌నిచేస్తోన్న నేత‌లు అంద‌రూ ఒప్పుకోవ‌డం లేదు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికే ఈ ప‌ద‌వులు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

ఏదేమైనా వైఎస్ ఫ్యామిలీతో ఆయ‌న‌కు ఉన్న ప్ర‌త్యేక అనుబంధం నేప‌థ్యంలో శ్రీనివాస్‌కు ఏదైనా ప‌ద‌వి రావాల‌నే త‌ప్పా… లేకుంటే ఆయ‌న ఇక‌పై పార్టీలో ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త మాదిరిగానే గ‌డ‌పాల్సి ఉంటుంది. ఇక కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ వాసుప‌ల్లి గ‌ణేష్ చెప్పిన వారికే వైసీపీ కార్పొరేట‌ర్ సీట్లు రానున్నాయి. మ‌రి ఈ స‌వాల్‌ను ఎదుర్కొని శ్రీనివాస్ రాజ‌కీయంగా ఎలా ముందుకు వెళ‌తారో ?  చూడాలి.

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news