మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. మహాత్మాగాంధీ ఆశయాలను తుంగలో తొక్కేలా నేటి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. గాంధీ అహింసాయుత సిద్ధాంతాన్ని వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చారని ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తారా..? అని నిలదీశారు.
అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరా గాంధీ వంటి వారినే ప్రజలు ఓడించారు, మీరెంత అంటూ ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థను అందరూ గౌరవించాల్సిందే అని స్పష్టం చేసారు. కోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాలని హితవు పలికారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. చలో మదనపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణం అని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యమకారులను అరెస్టు చేసి ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది అంటూ మండిపడ్డారు.