ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అపాయింట్మెంట్ కోసం సీఎం కేసీఆర్ పడిగాపులు కాయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలించడం చేతగాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. ఎవరూ పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద కెసిఆర్ పడిగాపులు కాస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులని వదిలి.. పక్క రాష్ట్రాల్లో చెక్కులు పంచడం సీఎం కేసీఆర్ కు తగదన్నారు.
2018 లో కేంద్రంలో చక్రం తిప్పుతా అని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్లా పడ్డారని ఆయన తెలిపారు. ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేని అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని దుయ్యబట్టారు. చట్టాలను మార్చి అప్పులు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిని కాగ్ తప్పు పట్టిందన్నారు. 3 లక్షల 29 వేల కోట్లకు లెక్కలు చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.