పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో నిజానిజాలు తేల్చి చెప్పాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు రావాలని చంద్రబాబుతోపాటు మంత్రి దేవనేని ఉమ సిద్ధంగా ఉండాలన్నారు. ఎవరి చర్య వల్ల వాల్ దెబ్బతిందో తెల్చుకుందామన్నారు.
కాపర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్ల వరదలకు దెబ్బతిందని మంత్రి తెలిపారు. కాపర్ డ్యాం పూర్తి చేయకుండా.. ఎవరైనా డయాఫ్రమ్ వాల్ కడతారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేపట్టాలా? లేదా కొత్తది నిర్మించాలా? అనే అంశంపై మేధావులు పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.
జూన్ 1వ తేదీ నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తామన్నారు. కాగా, వరదల కారణంగా దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. 1.7 కి.మీ నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌లో వరదల కారణంగా 300 మీటర్ల వరకు ఇసుక వచ్చింది. కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను నింపేందుకు డ్యామ్‌కు దిగువన 8 కిలో మీటర్ల వద్ద తవ్వకాలు నిర్వహించి.. ఇసుక నింపాలన్నారు.