కేసీఆర్-జగన్ కవర్ చేసుకున్నారా? మళ్ళీ స్టార్ట్ చేసేది ఎప్పుడు?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నీటి యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. అసలు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా కడుతుందని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. వరుసపెట్టి తెలంగాణ మంత్రులు..ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అసలు అక్రమంగా నీళ్లని దోచుకుంటుందని మాట్లాడారు. అటు ఏపీ మంత్రులు సైతం కాస్త కౌంటర్లు ఇవ్వడానికి ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అక్రమ ప్రాజెక్టులు కట్టిందని ఆరోపించారు.

kcr-jagan
kcr-jagan

అయితే ముందు వరకు సఖ్యతగా ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నపళంగా నీటి యుద్ధం చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇదంతా రాజకీయంగా లబ్ది పొందడానికే అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసలు హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ప్రభుత్వం…ఆంధ్రా, తెలంగాణ అంటూ నీటి యుద్ధానికి తెరలేపిందని ఫైర్ అయ్యాయి.

హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు వరకు ఇదే రచ్చ నడిచింది. ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయాక కాస్త తగ్గుతూ వచ్చింది. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకచోట కలిశారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లిలో కేసీఆర్, జగన్‌కు ఒక్కటయ్యారు. కేసీఆర్‌ వచ్చిన పది నిమిషాలకు జగన్‌ వచ్చారు. ఒకరి పక్కన ఒరు కూర్చుని ముచ్చటించుకున్నారు. వివాహాన్ని తిలకించిన అనంతరం టీ తాగేందుకు ఓ గదిలోకి వెళ్లారు. ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారని తెలిసింది.

అసలు తెలంగాణ ప్రభుత్వం జల విద్యుదుత్పత్తిని నిరాటంకంగా కొనసాగించడం, ప్రాజెక్టుల వద్ద ఏకంగా పోలీసు పహారా పెట్టడం ఉద్రిక్తతలను మరింత పెంచగా, దీనిపై ఏపీ సీఎం జగన్‌, కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ప్రధాని మోదీతో పాటు జలశక్తి మంత్రిని కలిసి.. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలతో పాటు కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాల వాటాపై చర్చించాలని డిమాండ్ చేశారు. అసలు అప్పుడు వీరి రచ్చ చూస్తే మళ్ళీ కలుసుకుంటారా అని అందరికీ డౌట్ వచ్చింది. కానీ తాజాగా అందరికీ షాక్ ఇచ్చి ఇద్దరు సీఎంలు కబుర్లు చెప్పుకున్నారు. అయితే ఇదంతా రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఇద్దరు సీఎంలు ముందుకెళుతున్నారని, రాష్ట్రాల పరంగా సెంటిమెంట్ లేపి రాజకీయంగా లబ్ది పొందడానికి ప్లాన్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కలిసిపోయి మళ్ళీ ఏదైనా ఎన్నికల సమయం ముందు హడావిడి చేస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news