నీవు వెళ్తున్న దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే కానీ వెనక్కి తగ్గద్దు అని చెబుతుంటారు. వెనక్కి తగ్గేవాళ్ళని చేతకాని వాళ్ళలా చూస్తుంటారు. ప్రపంచానికి పట్టుదల కలిగే వ్యక్తులంటే ఇష్టం. దానివల్ల అవతలి జీవితాల్లో ఆనందం లేకపోయినా సరే. ఏది ఏమైనా అనుకున్నది సాధించే తీరతాను, మద్యలో వదిలే ప్రసక్తే లేదు అనే వాళ్ళందరూ వారనుకున్నవన్నీ సాధించకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు పట్టుకోవడమే కాదు, వదిలివేయడమూ మంచిదే. ఎలాంటి సందర్భాల్లో వదిలివేస్తే బాగుంటుందో ఇక్కడ తెలుసుకోండి.
నిజానికి దీనికోసం మనుషుల మనసుల్లో పెద్ద విశ్లేషణ జరగాలి. ఆ విశ్లేషణ తాలూకు ఆఖరి నిర్ణయంగా వదిలివేయడం ఉండాలి. అలా విశ్లేషణ జరగడానికి ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.
నీ మనసు నీకు బలంగా చెప్పినపుడు
అన్ని దారులు ఒకేలా ఉండవు. నువ్వు వెళ్ళే దారి ఎలా ఉందనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నేను ఈ దారిలో ప్రయాణించలేనని నువ్వు బలంగా నమ్మినపుడు వదిలివేయడమే మంచిది. లేదంటే ఆ దారిలో ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక ఉన్నచోటే ఉండిపోతావు. దానివల్ల గమ్యం అందని ద్రాక్షే అవుతుంది.
నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం నీకు ఆనందం ఇవ్వనపుడు
జీవితంలో ఏది చేసినా ఆనందం కోసమే. నువ్వెటు వెళ్ళినా అక్కడ ఆనందం లేకపోతే అదంతా వృధా అన్నట్టే. నువ్వేదైతే లక్ష్యం కోసం పనిచేస్తున్నావో ఆ లక్ష్యం సాధించడంలో నీకు ఆనందం లభించనపుడు అక్కడ నుండి తప్పుకోవడమే కరెక్ట్. మరో దారి వెతుక్కునేందుకు కొంచెం సమయమైనా మిగులుతుంది.
ఇప్పుడు వదిలేస్తే వేరేవాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన నీకు వచ్చినపుడు
ఇలాంటి ఆలోచన వచ్చినపుడు వెంటనే మీరు వెళ్తున్న దారి నుండి పక్కకు తప్పుకోండి. ఇతరుల కోసం ఏం చేసినా మీరు సంతోషంగా ఉండలేరు. ప్రతీసారీ ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆలోచన మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు.
ఇది వదిలేస్తే వేరే ఏం చెయ్యాలన్న ఆలోచన కలిగినపుడు
వేరే ఏదీ చేయలేక ఇప్పుడు చేస్తున్న పని చేయడానికి ముందుకు రావడమంత దురదృష్టం ఇంకోటి ఉండదు. కొంచెం సాధన చేస్తే మీకు నచ్చే, మీరు మెచ్చే, మీకు తొందరగా అబ్బే పనులు చాలా ఉంటాయి.