సామాజిక అసమానతలు రూపుమాపే క్రమంలో ఎందరెందరో కృషి చేశారు. అయినా కూడా ఇవాళ్టికీ అవి మన రక్తంలో భాగం అయి ఉన్నాయి. వాటిని వద్దనుకుని మంచి సమాజ నిర్మాణ దిశగా పోరాడాల్సిన తరుణం రానే వచ్చింది అని అనుకోవడమే కానీ ఆచరణ మాత్రం అస్సలు కుదరని పనిగా మిగిలింది. ఈ తరుణంలో మహాత్మా జ్యోతిబాఫూలే జయంతిని పురస్కరించుకుని నిన్నటి వేళ జరిగిన జగన్ క్యాబినెట్ పునర్వ్యస్థీకరణ ఓ విధంగా మేలి మలుపు అని వైసీపీకి చెందిన చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసంతృప్త వాదం ఉన్నా కూడా ఓ విధంగా తెలుగుదేశం పార్టీ చేయలేని పని తాము చేయగలిగామని సంతృప్తతను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకుని తనకు ఎంతగానో కలిసివచ్చే శక్తులకు మంచి ప్రాధాన్యం ఇచ్చారని కూడా వారు అభిప్రాయపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఓ విధంగా కొన్ని నిర్ణయాల కారణంగా కాపు సామాజికవర్గం ఐదు మంత్రి పదవులు అందుకోవడం ఆశ్చర్యకరమే అయినా కూడా ఇది కూడా తమకు సమ్మతమే అని పార్టీలో అగ్ర వర్ణ నాయకులు చెబుతున్నారు. సామాజిక సమీకరణల్లో భాగంగా బొత్స సత్యనారాయణ లాంటి అగ్ర స్థాయి నాయకులను తిరిగి క్యాబినెట్ లోకి తీసుకోవడంతో మరింత మంచి ఫలితాలు ఎన్నికల వేళ అందుకోవచ్చని అంటున్నారు. వాస్తవానికి బొత్సను తప్పిద్దాం అని అనుకున్నా అది కుదరని పని అని తేలిపోయింది. ఆయనను తప్పించి ఉత్తరాంధ్ర పొలిటికల్ ఎఫైర్స్ కు రీజనల్ ఇంఛార్జ్ ను చేయాలని ముందునుంచి భావించారు.కానీ అది కాకుండా పోయింది.
ఇక మంత్రి వర్గంలో దాదాపు అన్ని బడుగు బలహీన సామాజిక వర్గాలకూ చోటు దక్కింది. ఇది కేవలం వెనుకబడిన వర్గాలకు మాత్రమే అనువర్తించిన సూత్రం.అయితే ఈ సూత్రం అమలు కారణంగా చాలా అగ్రవర్ణాలు తమ అవకాశాలు కోల్పోయాయి. పైకి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని చెబుతున్నా లోపల మాత్రం నిర్ణయం వేరొక విధంగా ఉంది. ఇక అసలు ప్రధాన చర్చ 70 శాతంకు పైగా పదవులను ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం వల్ల సామాజిక విప్లవం వస్తుందా లేదా వారి వెనుకబాటును తరిమేలా వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక విప్లవం సాధ్యం అవుతుందా అన్న సందేహాలు సంబంధిత వ్యక్తుల్లోనే కాదు సామాజికవేత్తల్లోనూ వెల్లడవుతోంది.
సామాజిక విప్లవం అంటే కేవలం పదవుల కేటాయింపు మాత్రమే కాదని ఆయా వర్గాల అభ్యున్నతికి వీలున్నంత వరకూ చేయూతనివ్వాలని, ముఖ్యంగా అన్ని వర్గాల్లోనూ ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, అందరికీ సమానంగా అవకాశాలు వర్తింపజేయాలని పలువురు కోరుతున్నారు. కేవలం పదవుల పంపకంతో సామాజిక విప్లవం వస్తుందన్న భ్రమను వీడాలని కూడా వైసీపీ వర్గాలకు హితవు చెబుతున్నారు.