బీజేపీ అనుకుంటే ఏమయినా చేయగలదు.జగన్ అనుకుంటే బీజేపీకి మించి చేయగలరు.ముఖ్యంగా పొత్తుల విషయమై ఆ పార్టీ, ఈ పార్టీ ఒకే విధంగా ఉన్నాయా అన్న డౌట్ ఒకటి వస్తుంది.కేసీఆర్ మాదిరిగా జగన్ అన్నీఓపెన్ అయి చెప్పరు. ఆయనెటు ఉంటారు అన్నది ఆఖరి నిమిషం దాకా తేలదు.తేల్చలేం కూడా! అందుకే జగన్ కు దగ్గరగా ఉండేవారు కూడా ఆయన స్టాండ్ ఏంటన్నది పూర్తిగా స్పష్టం చేయలేరు. రాష్ట్ర రాజకీయాల్లో మంచి పట్టున్న నేతగా జగన్ ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో మాత్రం పెద్దగా పేరు లేదు. కొన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవీ ఫలించలేదు. దీంతో జగన్ చాలా కాలం ఢిల్లీకి దూరంగా ఉండిపోయారు.
ఒకప్పుడు తమ అధినేత్రి సోనియా విషయమై వ్యతిరేకించి కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్నప్పటికీ తరువాత కాలంలో అన్నీ మారిపోయాయి. మోడీ రెండు సార్లు ప్రధాని అయ్యాక రాష్ట్ర బీజేపీ బలపడలేదు సరికదా పెద్దగా తమ గొంతుక కూడా వినిపించలేదు. ఈ తరుణంలో జగన్ ఇక్కడున్న బీజేపీ నాయకులను పెద్దగా టార్గెట్ చేయరు.అనవసరంగా ఒక్క మాట కూడా అననివ్వరు.ఓ విధంగా టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ మాట్లాడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి కానీ వైసీపీకి డ్యామేజ్ చేసిన దాఖలాలు లేవు.దీంతో ఇరు పార్టీల పొత్తు లేకున్నా లోపాయికారి ఒప్పందాలు అయితే ఉన్నాయి.
కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, పురంధరి లాంటి నేతలు జగన్ పై చేసే ఏ ఆరోపణలూ పెద్దగా ప్రజల్లోకి వెళ్లవు.అంతేకాదు వాళ్లు ఎన్ని అన్నా వైసీపీనే పట్టించుకోదు. రాజధాని రాజకీయంలో మాత్రం కాస్తో కూస్తో అమరావతి రైతుకు మద్దతిచ్చింది. కానీ అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఆఖరి నిమిషంలో న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకూ కార్యక్రమంలో పాల్గొని, మద్దతిచ్చినా అది కూడా ప్రభావితం చేయదు ఓటరును. ఈ విధంగా జగన్, బీజేపీ అన్నవి పైకి రెండు వేర్వేరు శక్తులు కానీ ఢిల్లీలో ఒక్కటే!కనుక బీజేపీ, వైసీపీ కలిసి పనిచేసేందుకు ఉన్న దారులన్నీ సుగమమే!