ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక మంత్రులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు కూడా. ఈ నేపధ్య౦లో సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారు.
ఆ తర్వాత దాన్ని శాసన సభలో ప్రవేశ పెట్టేందుకు గాను ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు దూరం కావాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. దీనితో సభలో విమర్శలే గాని వార్ వాతావరణం ఉండే అవకాశం ఏ మాత్రం లేదు. మండలి రద్దు గురించి సభలో చర్చించడం రాజ్యాంగ విరుద్దమని టీడీపీ ఆరోపిస్తుంది. ఉదయం 11గంటలకు శాసనసభలో మండలి అంశంపై చర్చ జరుగుతుంది.
అయితే మండలి రద్దు అనేది జగన్ డ్రామానే గాని అంత సినిమా లేదు అనేది తెలుగుదేశం వాదన. తనకు కేంద్రంతో దోస్తీ ఉంది కాబట్టి రద్దు చేయిస్తా అనేది జగన్ మాట. ఇక మండలి గురించి జగన్ ఏ నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనపడుతున్న తరుణంలో దీనిపై సుప్రీం లేదా హైకోర్ట్ కి వెళ్ళే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 లో బ్రతికించిన మండలిని 2020 లో జగన్ చంపాలి అనుకోవడం ఆశ్చర్యంగా మారింది.