900 రోజులు ఉద్యమం కారణంగా అమరావతి రైతులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అసలీ ఉద్యమం కారణంగానే వాళ్లు తిండీ నిద్ర కూడా మానుకుని ఉన్నారు. అమరావతి నిర్మాణాల పేరిట ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం తమ దగ్గర 33 వేల ఎకరాల భూమి గుంజుకుని తరువాత వచ్చిన సర్కారు ఆ పనే మరిచిపోయి, తమను నిలువునా ముంచింది అన్నది వారి వాదన. ఆవేదన కూడా ! ఈ క్రమంలో వీలున్నంత త్వరగా పనులు చేపట్టి తమను రక్షించాలని ఎప్పటి నుంచో వీళ్లంతా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు.
హై కోర్టు మొదలుకొని సుప్రీం కోర్టు వరకూ వివిధ దశల్లో వివిధ సందర్భాల్లో వీళ్లంతా తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఆఖరికి మొన్నటి వేళ హై కోర్టు కూడా కొన్ని స్పష్టమయిన తీర్పు ఇచ్చింది. అమరావతి కట్టడాలను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, 3 నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేసి, కనీస స్థాయిలో అయినా భవన నిర్మాణాలు పూర్తి చేసి, భూమి ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా వారికి చెల్లించాల్సిన పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఆ రోజు వారు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. భూ సేకరణకు బదులు భూ సమీకరణకు ఒప్పుకున్నారు. అంటే ఆ రోజు రైతుల నుంచి తీసుకున్న భూమికి బదులు రాజధాని నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చేసిన భూమి ఇచ్చేందుకు, ఇంకా చెప్పాలంటే.. అమరావతి లో చేపట్టే వాణిజ్య సముదాయాల్లో వాటాతో పాటు, పరిహారం కూడా ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు.
వాస్తవానికి అక్కడ ప్రభుత్వ భూమి తక్కువగా ఉండడంతో రెండు వేల ఎకరాల వరకే భూ సేకరణ అన్నది సాధ్యం అయింది. మిగతా భూమి అంతా ఆ రోజు చంద్రబాబు సర్కారు గుంటూరు,విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలను ఒప్పించి, ఈ ప్రాంతం అభివృద్ధికి సహకరించాలని వేడుకుంటూ, భూ సమీకరణకు సిద్ధం అయి ఆ విధంగా రాజధాని నిర్మాణానికి కదలిక తెచ్చారు. ప్రభుత్వం మారిపోవడంతో రాత్రికి రాత్రే మొత్తం సీన్ మారిపోయింది. తాజాగా అమరావతి పనుల్లో జగన్ కాస్త కదలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలిక.