మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో నడుస్తున్న ఆధిపత్య పోరుకు జగన్ చెక్ పెట్టారని చెప్పవచ్చు. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జోగి రమేష్ మైలవరంలో పెత్తనం చేయడంతో వసంతకు ఇబ్బందిగా మారింది. పైగా జోగి వర్గం..వసంతని సైడ్ చేస్తూ వస్తుంది. దీంతో వసంత అసంతృప్తితో కాస్త పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇదే క్రమంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం వచ్చింది. కానీ తాజాగా ఆయన జగన్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే జగన్..వసంతకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి..అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని పట్టించుకోకుండా..మైలవరంపై ఫోకస్ చేయడం, పెత్తనం చేయడంపై వసంత..జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జగన్ నియోజకవర్గంపై ఫోకస్ చేయాలని, గడపగడపకు కార్యక్రమం మొదలుపెట్టాలని, ఏమైనా ఇబ్బంది ఉంటే సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డికి చెప్పాలని, తనతో రాజకీయాల్లో మరో 30 ఏళ్ల పాటు ఉంటవాని జగన్..వసంతకు హామీ ఇచ్చారు.
ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టకుండా సరిచేద్దామని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. అయితే మైలవరం సీటు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పక్కగా మైలవరం సీటు నీదే అని వసంతకు జగన్ హామీ ఇచ్చినట్లు కనిపించడం లేదు. అటు పెడనలో ఈ సారి పోటీ చేయడానికి జోగి ఆసక్తిగా కనిపించడం లేదు. ఎలాగో మైలవరం తన సొంత స్థానం..అందుకే ఇక్కడకి రావడానికి చూస్తున్నారని టాక్.
పెడనలో గెలుపుకు అవకాశాలు తగ్గాయని అందుకే మైలవరంకు రావాలని జోగి చూస్తున్నారని ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. 2014లో మైలవరంలో జోగి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 2019లో పెడన వచ్చి గెలిచారు. మరి చూడాలి చివరికి మైలవరం సీటు ఎవరికి దక్కుతుందో.