ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గిరిజన గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని పొరుగు సేవల విధానంలో భర్తీ చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి రాజన్న దొర ఆదేశించారు. ఫ్యూచర్ లెర్నింగ్ విధానంలో ప్రతి ముగ్గురు విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు దత్తత తీసుకుని వారి ఉత్తీర్ణతకు బాధ్యత తీసుకోవాలన్నారు.
సచివాలయంలో ఆయన గురువారం గురుకులాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆదనపు స్టడీ అవర్స్ నిర్వహించాలి. ఆ సమయంలో ఆదనపు పౌష్టికాహారం అందించాలి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ధ్యానం చేయించాలి. కెరీర్ గైడెన్స్ తరగతులను నిర్వహించాలి. ఐఐటి-జేఈఈ పరీక్షల సన్నద్ధతతో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలి అని ఆదేశించారు.