ఆంధ్రావని వాకిట ఉద్యోగులంతా కోపంగా ఉన్నారు. ఉద్యోగులంతా ఆవేశంలో కూడా ఉన్నారు. ఉద్యోగులంతా చెప్పుకోలేని అభద్రతా భావంలో కూడా ఉన్నారు. ఉంటే ఉన్నారు అని తప్పుకునేందుకు అవకాశం లేని రోజులు ముందున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేయలేనివి మరియు ఈ ప్రభుత్వంకు చేతగానివి తాము చేస్తామని జనసేన ప్రకటించింది.టీడీపీ కూడా దాదాపుగా ఇదే ప్రకటన కాస్త అటు ఇటుగా భాష మార్చి చెప్పింది. భాష ఏదయినా భావం ఒక్కటే.. పార్టీలు వేరయినా అధికార పార్టీకి సంబంధించి పోల్ అయ్యే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడమే ప్రథమ కర్తవ్యం పవన్ కు ఇంకా ఇంకొందరికి కూడా ! అందుకే జగన్ నుంచి జనసేన వరకూ కొన్ని విషయాల్లో పోలికలు వస్తున్నాయి.విభేదాలు ఉన్నా కూడా పార్టీలు అన్నీ ఒకే సూత్రంతో పోతున్నాయి అన్నది జగన్ నుంచి జనసేన వరకూ తేలిన విషయాలే! అందుకే జగన్ అప్రమత్తం అయి తనదైన ముందస్తు చర్యలు తీసుకుని,చర్చలు చేపట్టారు కనుకనే సీపీఎస్ రద్దుకు వ్యూహం మొదలైంది.
సీపీఎస్ రద్దుకు టక్కర్ కమిటీ ఓ సూచన చేసింది. ఆ సూచన పాటించాలంటే రాష్ట్ర సర్కారుకు ప్రత్యేక నిధి ఒకటి అవసరం. దీని ప్రకారం రెగ్యులర్ పెన్షన్ పద్ధతికీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి మధ్య ఉన్న అగాధం పూడ్చాలంటే కొంత ఫండ్ ను ముందుగా ప్రభుత్వం రిజర్వు చేసి, ఆ విధంగా లోటును భర్తీ చేయాలి.అప్పుడు ఓపీఎస్ మరియు సీపీఎస్ అన్నవి సమానం అవుతాయి.
కానీ ఇప్పటికిప్పుడు ఓ ఫిక్సిడ్ ఫండ్ ను ఎక్కడి నుంచి తేగలరు? అందుకే చంద్రబాబు తెలివిగా రిటైర్మెంట్ ఏజ్ పెంచారు.
చంద్రబాబు నుంచి తెలివి తేటలను కాస్త అరువు తెచ్చుకుని వైసీపీ కూడా రిటైర్మెంట్ ఏజ్ ను 60 నుంచి 62కు పెంచింది.
ఈలోగా రెగ్యులర్ నోటిఫికేషన్లు రావు. సచివాలయ ఉద్యోగులు (గ్రామ మరియు పట్టణ స్థాయిలో పనిచేస్తున్న వారు) ఎప్పటి నుంచో కోరుతున్న జాబ్ రెగ్యులరైజేషన్ కు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 18 వేలు జీతం కాస్త 30 వేలు చేస్తుంది. అదేవిధంగా వలంటీర్లకు పురస్కారాల పేరిట కొంత మొత్తం ఇచ్చేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందని సన్మానం కూడా చేసేందుకు ఇప్పటికే
గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఆ విధంగా ఈ ఉగాది నాడు బాగా పనిచేసిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందనున్నాయి.
– డిస్కషన్ పాయింట్ – మన లోకం ప్రత్యేకం