కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఉగాండాలో భారతీయ సమాజంతో మాట్లాడుతూ, తాజాగా పాకిస్థాన్, చైనాలను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు. సాధారణంగ జై శంకర్ ఎంత మౌనంగ ఉంటారో అందరికి తెలుసు. కానీ ఇప్పుడు పాక్, చైనా ల పై విరుచుకుపడ్డారు ఆయన. భారత్ కు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి సరిహద్దు ఉగ్రవాదంలో పాలుపంచుకుంటున్న శక్తులకు ఇప్పుడున్నది మరో భారత్ అని తెలుస్తుందని, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని జై శంకర్ స్పష్టం చేశారు.
మన భారత దేశం కొత్త భారత దేశంగా రూపాంతరం చెందుతోందని పేర్కొన్నారు ఆయన. పాక్, చైనాల ఉంచి దేశ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను అణచివేసే శక్తి ఈ నవ భారతావనికి ఉందని తేల్చి చెప్పారు. యూరీ, బాలాకోట్ ఉదంతాలు కానీ ఈ విషయాన్ని చాటిచెబుతాయని జై శంకర్ తెలియచేశారు.
దశాబ్దాల తరబడి సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించిందని, కానీ ఈ నూతన భారతదేశంతో ఇక వారి ఆటలు సాగవన్న విషయం తెలిసి వస్తుందని వెల్లడించారు జై శంకర్. గత మూడేళ్లుగా చైనా సరిహద్దు ఒప్పందాల అతిక్రమణలకు పాల్పడుతోందని, భారీగా దళాలను రంగంలోకి దింపుతోందని మండిపడ్డారు. కానీ ఇవాళ భారత సైన్యం క్లిష్ట పరిస్థితుల్లో సైతం, అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రాల్లోనూ సన్నద్ధత చాటుతోందని జై శంకర్ పేర్కొన్నారు. “గతంలో మాదిరి కాదు… భారత సైనికులకు ఇప్పుడు పూర్తి మద్దతు ఉంది. వారి వద్ద సరైన ఆయుధాలు ఉన్నాయి, తగిన మౌలిక సదుపాయాలు వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి” అని స్పష్టం చేశారు. స్వీయ ప్రయోజనాలకు భంగం కలిగితే ఇప్పటి భారతదేశం ఎంతమాత్రం ఉపేక్షించదన్న విషయాన్ని తక్కిన ప్రపంచం గుర్తించాలని వెల్లడించారు జై శంకర్.