‘పోలవరం’పై ఫిబ్రవరిలో సీఎంలతో కేంద్ర జల్‌శక్తి శాఖ భేటీ

-

పోలవరం ప్రాజెక్టు వెనకజలాల ముంపుపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయనుంది. అంతకంటే ముందు ఈ నెల 13న దిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ సమావేశం జరగనుంది. ఇది పూర్తవగానే సీఎంల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు వెనకజలాల ముంపుపై సంబంధిత రాష్ట్రాలతో సీడబ్ల్యూసీ నిర్వహించే ఈ సమావేశం చివరిది కానున్నట్లు తెలిసింది.

ప్రాజెక్టు నిర్మాణంతో వెనకజలాలు విస్తరించే రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఓ దఫా ఈ కమిటీ సమావేశం జరిగింది. సీడబ్ల్యూసీ సూచనల ప్రకారం గత డిసెంబరులో అన్ని రాష్ట్రాలు తమ అభ్యంతరాలతో కూడిన నివేదికలను అందజేశాయి. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తిరిగి ఆయా రాష్ట్రాలకు ప్రత్యుత్తరాలు పంపించింది. వాటిపై చర్చించడానికి దిల్లీలో ఈ నెల 13న మరోమారు సాంకేతిక కమిటీ సమావేశం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news