బీజేపీ మాజీ అధికారప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల కారణంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చెలరేగుతున్నాయి. నిన్న ఢిల్లీ, యూపీ, రాంచీ, హైదరాబాద్ ఇలా పలు చోట్ల ఆందోళనలు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో రాళ్లదాడులతో పాటు వాహనాలను కాల్చివేశారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన ముస్లింలు తమ నిరసన తెలియజేశారు. యూపీలోని షహరాన్ పూర్, కాన్పూర్, లక్నో, ప్రయాగ్ రాజ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ తో పాటు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఘటనలు హింసాత్మకంగా మారాయి.
ఇదిలా ఉంటే శుక్రవారం ఢిల్లీలోని జామా మసీదులో ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున కొంతమంది రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అయితే తాము ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదని జామా మసీద్ ఇమామ్ ప్రకటించారు. ఇది ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ మనుషుల పని కావచ్చని వెల్లడించారు. అయితే ఈ ఘటన వెనక కొంత మంది దుండగుల హస్తం ఉందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. నిరసన వెనక ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై యూ/ఎస్ 188 ఐపీఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ శ్వేతా చౌహన్ వెల్లడించారు.