జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల తరువాత మరింతగా కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు. తాజాగా శనివారం కుల్గామ్ లోని ఖండిపోరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు ప్రారంభం అయ్యాయి. ఈ ఎన్ కౌంటర్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఓ ఉగ్రవాది హతం అయ్యాడు.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వరసగా కాశ్మీర్ హిందువులతో పాటు వలస కూలీలు, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు భారత దేశానికి మద్దతుగా ఉన్న వారిని చంపారు టెర్రరిస్టులు. కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ తో ప్రారంభం అయిన ఈ హత్యలు వరసగా కొనసాగాయి. కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, రాజస్తాన్ కు చెందిన బ్యాంక్ ఉద్యోగి, హిందూ మహిళా టీచర్ , బీహార్ కు చెందిన కూలీని కాల్చి చంపారు.