మిత్రపక్షాలు అంటే కలిసి నిర్ణయాలు తీసుకోవాలి.. వీలైనంతవరకూ కలిసి పోరాడాలి.. కానీ ఏపీలో ఆ పరిస్థితులు లేవు! అవును… ఏపీలో బీజేపీ – జనసేనలు మిత్రపక్షాలుగా ఉంటున్నా.. వారిలో మనసిక కలయిక లేదనే చెప్పాలి. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది.. బద్వేల్ ఎన్నికల్లో పవన్ నిర్ణయం!
అవును… బద్వేల్ ఉప ఎన్నిక చాలా హాట్ హాట్ గా నడిచే అవకాశం ఉందని. జనాల్లో జగన్ పై వ్యతిరేకత మొదలైందని చెబుతున్న ప్రతిపక్షాలు.. ఆ ప్రచారం నిజమని, పోనీ ఎంతోకొంత నిజమని నిరూపించేపనికి పూనుకుంటాయని అంతా భావించారు. మరి ముఖ్యంగా జగన్ తాటతీయాలని ఫిక్సయిన పవన్.. మరీ గట్టిగా పోరాడతారని అంతా విశ్వసించారు! కానీ… పవన్ పలాయనం చిత్తగించారు!
జనసైనికుల వేడిపై పవన్ నీళ్లు:
బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని పవన్ నిర్ణయించారు. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ… రాజకీయ విలువల కోసం విరమించుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్యను పోటీలో నిలిపారని, ఆమెను గౌరవించి పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. దీంతో… బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో మాంచి ఊపుమీదున్న జనసైనికులపై వేడిపై పవన్ నీళ్లు చల్లేశారు.
రాజమండ్రిలో పవన్ ప్రసంగం చూసిన బలిజలు బద్వేల్ లో కాస్త అధికంగానే ఉన్నారు! పవన్ ఇచ్చిన పిలుపుకు వారంతా స్పందించాలని భావించారు! జనసైనికులు బద్వేల్ లో కథం తొక్కాలని నిర్ణయించుకున్నారు! కానీ… పవన్ వెనక్కి తగ్గారు. రాజకీయ విలువల మాటున.. బద్వేల్ లో తోకముడిచారు! పోటీ అంటే పోటీనే.. ఇది రాజకీయం.. పైగా ప్రస్తుతం పవన్ కు ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వార్ సమయంలో ఈ ఎన్నిక అతిముఖ్యం! కానీ… పవన్ ఆ విషయం మరిచారు!
బీజేపీని ఇరకించేశారు:
కడపలో వైకాపాను కొట్టే సత్తా తమకు మాత్రమే ఉందంటూ బీజేపీనేతలు మైకులముందు కాస్త గట్టిగానే మాట్లాడారు. ఇక్కడ బీజేపీకి నుంచి బలమైన నేతలుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు సీఎం రమేష్ లాంటి వాళ్లు ఉండడం.. దానికి తోడు పవన్ ప్రచారం కూడా చేస్తారని నమ్మడంతో.. బీజేపీ కాస్త దూకుడు ప్రదర్శించింది! అయితే… ఉన్నపలంగా పవన్ హ్యాండిచేశారు!
అంటే… ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ప్రచారం – బీజేపీకి మద్దతు కూడా చాలా పరిమితంగా ఉండే పరిస్థితి! పైగా… “జనసేనకు మాత్రమే రాజకీయ విలువలు ఉన్నాయి – తమ మిత్రపక్షం బీజేపీ గురించి నన్ను అడగకండి…” అనేస్థాయిలో పవన్ తాజా నిర్ణయం ఉందనే మాటలూ వినిపిస్తున్నాయి.
టీడీపీకి బ్యాక్ ఎండ్ సపోర్ట్?:
ఈ ఎన్నికల్లో జనసేన పోటీనుంచి తప్పుకోవడం వెనక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే ప్రచార మొదలైంది! జనసేన కూడా అక్కడ పోటీచేసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కంటే… టీడీపీ పోటీకి తెరవెనుక మద్దతు ఇవ్వాలనే ఆలోచన చేసినట్లుంది! ఫలితంగా జనసేన బలంగా ఉందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కనపెట్టి… ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఎంతో కొంత గట్టిగా వినిపించాలని భావించినట్లుంది! దీని ఫలితమే జనసేన బద్వేల్ నిర్ణయం అని అంటున్నారు విశ్లేషకులు!