హోరాహోరీగా గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకు దొరికిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, ముందుకు వెళుతున్నాయి. పొత్తులు.. ఎత్తులు వేస్తూ, గ్రేటర్ లో విజయం సాధించాలని గట్టిగానే కష్టపడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా, బిజెపి జనసేన పార్టీ వ్యవహారాలు సరిగ్గా ఎన్నికల ముందు వివాదాస్పదం అవ్వడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. జనసేన కు గ్రేటర్ పరిధిలో గెలిచే అంత బలం లేకపోయినా, సొంతంగా పోటీ చేస్తామని ధీమాగానే ప్రకటించారు.ఏపీలో తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీని సంప్రదించకుండానే పవన్ గ్రేటర్ ఎన్నికల్లో తాము సొంతంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు . పవన్ ప్రకటన అప్పట్లో రాజకీయ వర్గాల్లో గందరగోళం రేపింది.
అసలు ఏ ధైర్యం చూసుకుని పోటీకి దిగుతున్నారు అంటూ రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే చివరికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి , బండి సంజయ్ వంటి వారి జోక్యంతో జనసేన పోటీ నుంచి విరమించుకుంది. సొంతంగా పోటీ చేస్తే గెలవలేము అని పవన్ వెనక్కి తగ్గారో లేక బీజేపీతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ పార్టీకి గ్రేటర్ లోనూ మద్దతునిచ్చారో తెలియదు గాని, బీజేపీని గెలిపించాలని పవన్ తమ పార్టీ శ్రేణులకు పిలుపు అయితే ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జనసేన పై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ప్రస్తుతం పొత్తు ఏదీ లేదని, ఆ పార్టీ పొత్తు తమకు అవసరం లేదు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జనసేన వర్గాలను ఆందోళనకు గురి చేశాయి.
అసలు బీజేపీ నేతల ఒత్తిడి మేరకే తాము ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాము అని, అరవింద్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అరవింద్ వ్యాఖ్యలను ఇప్పటికీ జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రేటర్ లో కాస్తో కూస్తో జనసేనకి బలం ఉందని, ఎన్నికల సమయంలో తాము ముందుగా ప్రకటించినట్టుగా , పోటీ చేసి ఉంటే ఇంతటి అవమానం జరిగి ఉండేది కాదనే విషయాన్ని బాధ గా జనసేన వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన , బీజేపీ ఈ రెండు పార్టీల్లో ఎవరు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనేది క్లారిటీ ఇప్పటికే లేకుండా పోయింది. ఇక్కడ జనసేన అభ్యర్థిని రంగం లోకి దించే విషయం పై తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన పవన్ ను పెద్దగా పట్టించుకోనట్లు గానే బిజెపి పెద్దలు వ్యవహరించారని ఇప్పుడు జనసైనికులు హైలెట్ చేస్తున్నారు. ఈ మేరకు జనసైనికులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్ లు వైరల్ అవుతున్నాయి. ఇక బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నా, బిజెపి పెద్దలు ఎవరూ ఖండించకపోవడం, ఆ పార్టీ నాయకులకు మరింత బాధను కలిగిస్తుంది. బీజేపీతో విరోధం పెట్టుకుంటే ఏపీలో జనసేన పరిస్థితి మరింత దారుణంగా అవుతుందనే విషయాన్ని గ్రహించే బీజేపీ పై సుతి మెత్తగా సెటైర్లు వేస్తూ, పార్టీ వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తోంది.