దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. సవరించిన పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాస్తేనే ర్యాంకులు కేటాయించనున్నారు. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 30 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
వీరికోసం తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 28 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు సెప్టెంబర్ 11న వెలువడనున్నాయి. అదేనెల 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తున్నది. కాగా, ఇందులో ఉత్తీర్ణులైనవారికి దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లు
కేటాయించనున్నారు. సీట్ల సంఖ్యకు రెండున్నర రెట్ల మంది ఉత్తీర్ణులయ్యేలా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు.