దివంగత పీజీ మెడికో డాక్టర్ ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ప్రీతి చనిపోయిన సమయంలో.. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రీతి చెల్లెలు పూజకు HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ బేసిస్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించారు. ఈ మేరకు హెచ్ఎండీఏ సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.
డాక్టర్ ప్రీతి మరణంతో ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గ పార్టీ తరపున విరాళాలను సేకరించి రూ. 20 లక్షలు ప్రకటించి, ఆ మొత్తాన్ని వారికి అందజేశారు. అదే సమయంలో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని ప్రీతి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ తాను నిర్వహిస్తున్న పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే హెచ్ఎండీఏ ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ బేసిస్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రీతి దుర్ఘటన బాధాకరం. ఆ ఘటన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాము. ఆ కుటుంబానికి అండగా ఉన్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మనసున్న మహారాజులు. మాట ఇస్తే తప్పరు. పార్టీ, ప్రభుత్వం కూడా ఆ విధంగానే నడుస్తున్నది. ఆ రోజు వచ్చి మాట్లాడిన ఒక్క ముఖం కూడా మళ్ళీ కనిపించలేదు అని అన్నారు.