తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి లభిస్తోన్న మద్దతు చూసి కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారని అన్నారు జేపీ నడ్డా. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జేపీ నడ్డా. తెలంగాణలో మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీకి లభిస్తున్న మద్దతు చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందని జేపీ నడ్డా ఆయన విమర్శించారు.
మేం ప్రజాస్వామ్యయుతంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కేసీఆర్‌కు చరమగీతం పాడుతామని వ్యాఖ్యానించారు జేపీ నడ్డా. మరోవైపు, బండి సంజయ్ తన యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈ విషయంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.