చంద్ర‌బాబుకు ‘ జై ఎన్టీఆర్ ‘ షాక్‌

-

ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత నాలుగు నెలలకే చంద్రబాబుకు పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం అయినట్లు ఉంది. అందుకే వెంటనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతూ పార్టీని వీడి బయటకు వెళ్లి పోతున్న కార్యకర్తలు, నాయ‌కుల‌కు కాస్త నమ్మకం కలిగించే ప్రయత్నాలు మొదలెట్టేశారు. తాజాగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో బాబు ఊహించని విధంగా టిడిపి కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని లేవనెత్తారు. ఓవైపు వైసీపీ బాధితుల ఓదార్పు యాత్ర‌ అంటూ చంద్రబాబు నానా హంగామా చేసేందుకు ప్రయత్నిస్తుంటే… మరోవైపు కార్యకర్తల నుంచి జై ఎన్టీఆర్ నినాదాలు రావడంతో చంద్రబాబుతో పాటు అక్కడ ఉన్న టిడిపి నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఎంత ప్రయత్నించినా వారు ఎన్టీఆర్ నినాదాలు ఆగకపోవడంతో… అక్కడున్న నేతలు నినాదాలు చేస్తున్న వారిని బలవంతంగా బయటకు పంపించారు. ఈ సమావేశం నుంచి బయటకు వచ్చిన వారంతా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ పుంజుకుంటుందని… మరో 15 ఏళ్ల వరకు పార్టీకి భవిష్యత్తు ఉంటుందని… జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే టీడీపీకి భవిష్యత్ లేదని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అక్క‌డితో ఆగ‌కుండా లోకేష్‌ను సైతం వారు ఓ ఆటాడుకున్నారు. లోకేష్ ప్రజల్లో తిరిగినా తిరగకపోయినా ఒకటే. ఆయన తిరిగినా వేస్ట్. మేం మాత్రం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తాం. జూనియర్ ఎన్టీఆర్ కాకుండా లోకేష్ వస్తే ప్రజలకు టీడీపీపై మంచి ఫీలింగ్ రాద‌ని… సీనియ‌ర్ ఎన్టీఆర్ నాడు పార్టీ పెట్టారు…. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు పార్టీని న‌డిపించారు… ఇప్పుడు ఎన్టీఆర్ వ‌స్తేనే పార్టీ బ‌తుకుతుంద‌ని… ప్ర‌స్తుతం యూత్ ను ఆకర్షించే శక్తి ప్రస్తుతం టీడీపీలో ఎవ్వరికీ లేదు, కాబట్టి ఎన్టీఆర్ రావాల్సిందే అని నిర్మొహ‌మాటంగా త‌మ అభిప్రాయం కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

ఏదేమైనా చంద్ర‌బాబు త‌న కొడుకు లోకేష్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఇచ్చేందుకు నానా తంటాలు ప‌డుతుంటే… మ‌రోవైపు టీడీపీ కార్య‌క‌ర్త‌లే ఎన్టీఆర్ రావాలంటూ ఇలా నినాదాలు చేస్తుండడంతో చంద్ర‌బాబుకు టీడీపీ కార్య‌క‌ర్త‌ల సెగ త‌ప్పేలా లేదు. ఇప్పుడే ఇలా ఉంటే మ‌రో నాలుగేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండి బండి లాగించ‌డం అంటే బాబు ప‌రిస్థితి ముందు నుయ్యి… వెన‌క గొయ్యే అన్న‌ట్టుగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news