దివంగత వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి కరెక్టుగా నేటితో నాలుగేళ్ళు పూర్తి అయ్యాయి. మొదట గుండెపోటుతో చనిపోయారని వైసీపీ మీడియా, వైసీపీ నేతలు చెప్పడం..ఆ తర్వాత ఆయనని హత్యచేశారని, తేలడం హత్య చేయించింది టిడిపి నేతలు, చంద్రబాబు అని జగన్ తో సహ వైసీపీ నేతలు చెప్పడం, నారాసుర రక్త చరిత్ర అని వైసీపీ మీడియా ప్రచారం చేయడం జరిగిపోయాయి.
వివేకా హత్య కేసు 2019 ఎన్నికల్లో బాగా ప్రభావం చూపించింది..వైసీపీకి ప్లస్ అయింది. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ వివేకా కేసుని పట్టించుకుని కనిపించలేదు. గతంలో సిబిఐ కావాలని పిటిషన్ వేసి..అధికారంలోకి వచ్చాక దాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ కేసు విషయంలో వివేకా కుమార్తె సునీత పొరాడి సిబిఐ విచారణ జరిగేలా చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురుని అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణ చేస్తుంది. ఇదిలా ఉండగా నేడు 4వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ కడప జిల్లా పులివెందుల్లో వివేకా సమాధి వద్ద నివాళులర్పించారు.
న్యాయం గెలవాలని.. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదని ఈ సందర్భంగా సునీత అన్నారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
వివేకా వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు #JusticeForYSViveka ట్యాగ్‌ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రంలో ప్రతి ఇంటా తెలుసని… అది ఆ ఇంట జరిగిన కుట్రే అని బాబు చెప్పుకొచ్చారు.
అటు లోకేశ్ సైతం స్పందిస్తూ.. ”గొడ్డలి మీదే, వేటు వేసింది మీరే. మీ చేతులకు అంటిన రక్తం మరకలు మాకు అంటించాలని చూశావు. ఆధారాలు చెరిపేశావు. జనాల్ని నమ్మించేశాం అనుకున్నావు. గూగుల్ టేక్ అవుట్ కి దొరికేశావు. ఇంకెన్నాళ్లీ తప్పుడు రాతలు, దాగుడుమూతలు జగనాసుర. నేరం ఒప్పుకో.. బాబాయ్ ని చంపిన పాపం ప్రక్షాళన చేసుకో” అని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
ఇక #JusticeForYSViveka అనే ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. పలువురు వివేకాకు న్యాయం జరగాలని ట్వీట్లు చేస్తున్నారు.