అమెరికా అధ్యక్ష్య అభ్యర్థులపై కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్టు వెల్లడించారు పోలీసులు.
అర్థరాత్రి సమయం కావడంతో కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ కాల్పులు జరగడం ఇది రెండో సారి. సెప్టెంబర్ 16న అర్థరాత్రి తరువాత కిటికి దగ్గర బుల్లెట్ల వర్షం కురిపించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ పై రెండోసారి హత్యాయత్నం జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. నిందితుడు ర్యాన్ రౌత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీక్రెట్ సర్వీస్ అతని పై కాల్పులు జరిపిన తరువాత రౌత్ కారులో పారిపోయాడు.