కాంగ్రెస్ నేతలకు కమలం ఓపెన్ ఆఫర్..బండి ఫోకస్..!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య చిచ్చు రేగిన విషయం తెలిసిందే. రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఇటీవల టి‌పి‌సి‌సి పదవుల భర్తీపై మొదట కొందరు సీనియర్లు భగ్గుమన్నారు. తమకు చిన్న పదవులు ఇచ్చారని చెప్పి రాజీనామాలు కూడా చేశారు. అలాగే టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు కామెంట్ చేశారు. దీంతో పదవులు పొందిన కొందరు నేతలు రాజీనామాలు చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 13 మంది నేతలు రాజీనామాలు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో రచ్చ నడుస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణలోని బీజేపీ నేతలు…కాంగ్రెస్ నేతలని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు..రేవంత్ వల్ల కాంగ్రెస్ నాశనం అవుతుందని, మిగిలిన నేతలు బీజేపీలోకి రావాలని కోరారు. ఇక కాంగ్రెస్ లో రచ్చ నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్లు సమాచారం. కొందరు కాంగ్రెస్ నేతలపై ఫోకస్ చేసి వారిని బీజేపీలోకి లాగడానికి చూస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాలనుకునే కాంగ్రెస్ నేతలకు బీజేపీ సాదర స్వాగతం పలుకుతోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అయితే బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. బలం లేని బీజేపీ..కాంగ్రెస్ నుంచి గురించి మాట్లాడుతుందని, రేవంత్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నామని మల్లు రవి అన్నారు.

రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అని కోమటిరెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, నోరు జారి ఇష్టమున్నట్టు మాట్లాడితే నాలుక చీరుస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ పెట్టిన రాజకీయ బిక్షతో పదవులు పొంది ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా, ఎంపీ గా గెలిచిన రాజగోపాల్ రెడ్డి, డబ్బులకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. మొత్తానికి ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో ట్విస్ట్‌లు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version