కాపులని బీసీలు చేర్చి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు…కాపు రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి..కేంద్రానికి పంపారు. కానీ అక్కడ కాపు రిజర్వేషన్లకు బ్రేక్ పడింది. దీంతో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపులు ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.
అది అలా నడుస్తుండగానే 2019 ఎన్నికల ముందు కేంద్రం..అగ్రవర్గాల్లోని పేదలకు సెపరేట్ గా 10 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఇక ఈ రిజర్వేషన్లని చంద్రబాబు ఏపీలో కూడా అమలు చేశారు. అయితే అగ్రవర్గాల్లో కాపులు ఎక్కువ. దీంతో వారికి 5 శాతం కేటాయించారు. మిగిలిన వర్గాలకు 5 శాతం కేటాయించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క కులానికే 5 శాతం కేటాయించడం కుదరదని చెప్పి..టోటల్ గా 10 శాతం రిజర్వేషన్లని పక్కన పెట్టారు.
ఇదే క్రమంలో తాజాగా కేంద్రం ఈ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చట్టం చేశామని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు కల్పించే అధికారం రాష్ట్రానికి ఉందని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ చెప్పుకొచ్చారు. అంటే కాపులకు చంద్రబాబు ఆనాడు ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేటాయించడంలో తప్పు లేదని తేలిపోతోంది. అదేసమయంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కుదరదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ ఇప్పుడేమి సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
10 శాతం రిజర్వేషన్లని అమలు చేయకపోవడం వల్ల 56,100 ఉద్యోగాలు అగ్రవర్గ పెదాలు కోల్పోయారు. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ వచ్చింది. కానీ జగన్ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు దీనిపై ఎలా ముందుకెళ్తారనేది చూడాలి.