ఏళ్లుగడుస్తున్నా హామీలు మాత్రం నెరవేరడం లేదన్నారు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ . తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, సంక్షేమం కోసం పాటుపడేది టీడీపీయేనని అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి పూర్వవైభవం సాధించడం ఖాయమన్నారు కాసాని జ్ఞానేశ్వర్ . శనివారం ఎన్టీఆర్ భవన్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, ఇళ్లజాగ ఉన్నవారికి మూడులక్షలు, నిరుద్యోగ భృతి, పోడుభూములకు పట్టాలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంతో ఎండగట్టాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలోపార్టీని బలోపేతం చేయాలన్నారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు టీడీపీ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిశీలకులు వేజండ్ల కిషోర్ బాబు, బెల్లంపల్లి, రామగుండం నియోజకవర్గాల నాయకులు గద్దల నారాయణ, ఠాకూర్ మణిరామ్ సింగ్, నిమ్మకాయల ఏడుకొండలు కంది చంద్రయ్య, దామోదర్ రెడ్డి, రవి, మల్లయ్య, పాల్గొన్నారు.