టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది. తెలంగాణలో తక్షణమే టీచర్ల బదిలీలు పదోన్నతులకు షెడ్యూలు విడుదల చేయాలని, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పిఆర్టియు టిఎస్ చీఫ్ పింగిలి శ్రీ పాల్ రెడ్డి కోరారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రగోతం రెడ్డి, పిఆర్టియు టిఎస్ నేతలు బాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి తో శ్రీపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో మంత్రిని కలిశారు.
బదిలీలు, పదోన్నతుల విషయాన్ని ప్రస్తావించారు. ఐదు సంవత్సరాలుగా తెలంగాణలో పదోన్నతులు, సాధారణ బదిలీలు లేక ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రి సబితకు వివరించారు. అయితే, దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. టీచర్లపై డిమాండ్‌పై త్వరలోనే ప్రకటన రానుందని ఆమె ప్రకటించారు.