బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు విమర్శలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒకరిపై ఒకరు తిట్టుకోవడానికే పరిమితమయ్యారని ఆయన అన్నారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలను ఎలా కాపాడుకోవాలని ప్రయత్నం చేయట్లేదన్నారు. దేశ, రాష్ట్ర పాలనపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. వీరి రాజకీయాలు ప్రజలను రక్షించేలా కనిపించడం లేదన్నారు.
శాంతి భద్రతలు కాపాడటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోనే మహిళా దర్బార్ నడుస్తోందన్నారు. మహిళలకే రక్షణ కల్పించని బీజేపీ.. దర్బాన్ ఎలా నిర్వహిస్తుందో అర్థం కావడం లేదన్నారు. మత రాజకీయాలు, కుల రాజకీయాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకుని కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహిస్తోందన్నారు.