నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ హాలియాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో సాయంత్రం 6 గంటలకు సభ మొదలు కానుంది. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సాగర్ కు వరాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రంగా ఉండడంతో బహిరంగ సభను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
లక్ష మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో అంత మందితో సభ అవసరమా ? అని ఎంత మంది ప్రశ్నిస్తున్నా, అధికార పార్టీ నేతలు వినే పరిస్థితి లేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తామని చెబుతున్నారు కానీ అది ఎంతవరకు అనేది చెప్పలేం.తమ పొలాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సభను ఆపేలా ఆదేశించాలంటూ రైతులు నిన్న దాఖలుచేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి రాకరించారు. దీంతో సభకు అడ్డంకులు తొలిగాయి.