కాశ్మీర్ పండిట్ల విషయంలో కెసిఆర్ మౌనంగా ఉండడం హిందూ వ్యతిరేకతే – విజయశాంతి

-

కాశ్మీర్లో పండిట్లు, మైనారిటీ హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. కాశ్మీర్ పండిట్ల విషయంలో కెసిఆర్ మౌనంగా ఉండటానికి హిందూ వ్యతిరేకతే కారణమని అన్నారు. ” కశ్మీర్‌లో పండిట్లు, మైనార్టీ హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీస్తున్నరు. తాజాగా షోఫియాన్ జిల్లాలో కశ్మీరీ పండిట్ సోదరులు సునీల్, పింటూలపై జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో సునీల్ మరణించడం దురదృష్టకరం.

పాక్ ప్రేరేపిత ఈ ఉగ్రవాదులు కశ్మీర్‌లో మైనార్టీ హిందూ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులు, టీచర్లు, చివరికి కూలీలను కూడా చంపుతూ దేశంలో కల్లోలం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తున్నరు. ఈ పరిణామాలపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంటే…. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీఆరెస్, దాని సయామీ కవల పార్టీ ఎంఐఎంల తీరు ఎప్పటిలాగే హిందూ వ్యతిరేకతకు అద్దం పట్టింది. దేశంలో హైందవేతరులెవరికి చీమకుట్టినా ఎంతో బాధతో స్పందించే ఈ పార్టీలు కశ్మీర్‌లోని మైనార్టీ హిందువులకు జరుగుతున్న అన్యాయంపై భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నయి.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అయితే… కశ్మీరులో ఆర్టికల్ 370 ఎత్తివేత వల్లే ఇలా జరుగుతోందంటూ భారత వ్యతిరేక దేశాలైన పాక్, చైనా, టర్కీల తీరుకు అనుకూలంగా మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రజల్ని వదిలేసి పక్క రాష్ట్రాల బాధితులకు మాత్రం సాయం చెయ్యడానికి ముందుండి పరుగులు తీసే సీఎం కేసీఆర్ గారు సైతం కశ్మీర్ పండిట్ల విషయంలో మౌనంగా ఉండటానికి హిందూ వ్యతిరేకతే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కశ్మీరు ఉగ్రవాదుల ఆటలు కట్టించేందుకు మన కేంద్రం కృత నిశ్చయంతో ఉంది… మన సైన్యం ప్రాణాలొడ్డి ముందుకెళుతోంది. కానీ, మన విపక్షాలు మాత్రం ఓటు రాజకీయాలు చేస్తున్నయి.” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news