కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి కమిషన్లు నొక్కడానికే కేసీఆర్ ఢిల్లీ వచ్చారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమకున్న సమాచారం మేరకు కెసిఆర్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశమై, వివిధ బ్యాంకుల నుంచి రావలసిన లోన్లపై సమావేశమయినట్టు తమకు సమాచారం ఉందన్నారు రేవంత్ రెడ్డి. లోన్లు తీసుకువచ్చి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి అందులో నుంచి కమిషన్లు మెక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఓవైపు భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం కొట్టుకుపోతుంటే కనీస బాధ్యత లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. కెసిఆర్, మోడీ ఇద్దరూ తెలంగాణకి అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చిన ఉపద్రవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పట్టించుకోవడంలేదని అన్నారు. తెలంగాణకు పరిశీలన బృందాలను పంపించాలని తానే ప్రధానికి లేఖలు రాశానని తెలియజేశారు. తెలంగాణలో ఉన్న క్లిష్ట పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అవినీతిని బయట పెడతారనే కేసీఆర్ ప్రధానిని ప్రశ్నించడం లేదని అన్నారు.