ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుక ఘనంగా ముగిసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్అర్ సినిమా చరిత్ర సృష్టించింది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును గెలుచుకోవడంతో సంబరాలు మొదలయ్యాయి. అయితే అవార్డు అందుకున్న సమయంలో కీరవాణి ఇద్దరు హీరోల పేర్లు చెప్పకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
95 వ ఆస్కార్ అవార్డులు వేడుక భారతీయులకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో రెండు ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రాగా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా ఆస్కార్ గెలుచుకుంది. భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్షణాలు అందరిని ఆనందంలో ముంచెత్తాయి. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఈ అవార్డు అందుకోవడానికి స్టేజ్ పైకి వెళ్లిన కీరవాణి ఆ పాటలో డాన్స్ చేసి ఇంత క్రెడిట్ తీసుకువచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లను చెప్పటం మర్చిపోయారు. తన స్పీచ్ లో రాజమౌళి, కార్తికేయ పేర్లు మాత్రమే చెప్పారు.. ఈ విషయంపై ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఎలా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం కొంత నిరాశలో వునట్టు తెలుస్తొంది. ఆస్కార్ అందుకోవటం ఎంతో విలువైన ఘట్టం.. జీవితంలో ఒక్కసారి అయినా అలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు.. అలాంటి విశ్వవేదిక పైన అవార్డు అందుకున్న సమయంలో వీరిద్దరి పేర్లను ప్రస్తావిస్తే బాగుండు అనే ఆలోచన వినిపిస్తుంది.. అయితే అంతటి ఆనందాన్ని కలో నిజమో ఆలోచించేలాగా ఆ క్షణాలు గడిచిపోతాయి. ఆ టెన్షన్లో ఏమీ గుర్తు రాదు. అందుకే వీరిద్దరి పేర్లను కీరవాణి ప్రస్తావించి ఉండకపోవచ్చు అని మరో వాదన కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఆర్ఆర్అర్ సినిమాకు ఆస్కార్ రావడం అందరినీ ఆనందంలో ముంచెత్తిందనే చెప్పాలి.