కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజ గురించి తెలియని వారుండరు. తరచూ వివిధ రకాల వైరస్ లతో కొట్టుమిట్టాడే కేరళ ప్రజలను ఆ వ్యాధుల నుంచి వీలైనంత త్వరగా కోలుకునేలా చేయడమే గాక ఆరోగ్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆమె ప్లానింగ్, టైమింగ్ తో ప్రజలను కాపాడుతూ వచ్చారు. ఆరోగ్య రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు కూడా గెలుచుకున్నారు.
అయితే తాజాగా ఈ మాజీ మంత్రి తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అదేంటంటే.. వైద్య సేవల నిర్వహణలో సేవలకు మెచ్చి లభించిన ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డును తిరస్కరిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమె.. ఈ అంశంపై పార్టీతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులపై క్రూరత్వానికి పాల్పడిన దివంగత అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరుతో ఇస్తున్న ఈ అవార్డును స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్టు’ తెలిపారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం- కేరళ ఆరోగ్యశాఖ సమష్టి కృషి ఫలితంగా లభించిన ఈ పురస్కారాన్ని వ్యక్తిగత హోదాలో స్వీకరించేందుకు తనకు ఆసక్తిలేదని ఆమె పేర్కొన్నారు.