ప్రజలకు 24/7 రక్షణగా ఉంటారు పోలీసులు. అలాంటి పోలీసులకే ఆపద వస్తే.. వస్తే కాదు వచ్చింది. కానీ అది మనుషుల వల్ల కాదు కోతుల వల్ల. కోతుల వల్ల వచ్చిన సమస్యను తొలగించుకోవడానికి వాళ్లేం చేశారో తెలిస్తే.. ఐడియా అదిరింది గురూ అని అనక మానరు. ఇంతకీ ఏం చేశారంటే..?
కేరళలోని ఓ పోలీస్ స్టేషన్ సిబ్బంది కోతుల దాడుల నుంచి కాపాడుకోవడానికి పాములను రక్షణగా వినియోగించుకుంటున్నారు. మరి పాముల వల్ల వారికి హాని కలగదా అని సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఏర్పాటు చేసుకున్నవి బొమ్మ పాములు. కేరళ-తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతంలో ఉన్న కుంబుమ్మెట్టు పోలీస్ స్టేషన్ ఈ వింత దృశ్యానికి వేదికైంది.
సమీప అటవీప్రాంతంలో నుంచి తరచుగా కోతులు గుంపులు గుంపులుగా స్టేషన్‌లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుండటంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలియక తలలు పట్టుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా నివసించే ఓ రైతు వారికి ఓ సలహా ఇచ్చారు.
పంటపొలాల్లోకి కోతులు చొరబడకుండా తాను పాము బొమ్మలు ఏర్పాటు చేసుకున్నానని, వాటిని చూసి వానరాలు బెదిరిపోతున్నాయని చెప్పారు. దీంతో పోలీసులు కూడా రబ్బరు పాము బొమ్మలను స్టేషన్ ప్రాంగణంలోనూ, చెట్లపైనా ఏర్పాటు చేశారు. చూడ్డానికి నిజమైన పాముల్లాగే ఉన్న ఆ బొమ్మలతో తమ బాధలు తప్పాయని, కోతుల బెడద తగ్గిందని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.