తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే కులగణన సర్వే పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీస్టేడియంలో నిర్వహించిన చిల్డ్రన్స్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. కులగణనపై అపోహలను తొలగించే బాధ్యతను విద్యార్థులే తీసుకోవాలన్నారు. ఎవ్వరూ అడ్డుపడ్డా కులగణన ఆగదు అన్నారు. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి దీనిపై అవగాహన కల్పించాలన్నారు. కులగణన వల్ల కొందరూ పథకాలు పోతాయనే అపోహలున్నాయి.
కులగణన వల్ల సంక్షేమ పథకాలను తొలగిస్తారని కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు రాని పథకాలు కొత్తగా వస్తాయన్నారు. ఇది ఎక్స్ రే కాదు.. మెగా హెల్త్ చెకప్ లాంటిదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన సర్వే వల్ల 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని తెలిపారు. విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే.. కులగణన సర్వే చేపడుతున్నట్టు తెలిపారు. కులగణనతో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కులగణన సర్వే కొనసాగుతుందని తెలిపారు.