రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా పూర్తిగా పరిపాలనా పరమైన వ్యవహారాలకే పరిమితమై.. కేంద్ర అధికారులతో నిత్యం టచ్‌లో ఉండేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ్ కల్లాంకు ఆ బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం సీఎంఓలో కొన్ని మార్పులు జరిగాయి.
ఆ మార్పుల్లో సీనియర్ మాజీ ఐఏఎస్‌లుగా ఉన్న అజేయ్ కల్లాం, పీవీ రమేష్ ఇద్దర్ని సీఎంఓ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే అప్పట్లో ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. అజేయ్ కల్లాంను కూడా తప్పించేశారా..? అనే స్థాయిలో చర్చ జరిగింది. కానీ అజేయ్ కల్లాం సేవలు సీఎంఓలో కంటే.. ఢిల్లీ వ్యవహరాలను చక్కబెట్టే విషయంలో మరింత అవసరమని భావించిన తర్వాతే జరిగిందని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతోంది.
పరిపాలనా పరంగా అధికారులతో ఎలాంటి సంప్రదింపులు జరపాలన్నా.. కేంద్రానికి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టాలన్నా అజేయ్ కల్లాంకే బాధ్యతలు అప్పగిస్తోంది ప్రభుత్వం. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం అజేయ్ కల్లాం ఢిల్లీ పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే.. కేంద్రంతో పరిపాలనా పరమైన వ్యవహారాలను చక్కబెట్టే కీలక బాధ్యతలు అజేయ్ కల్లాంకు కట్టబెట్టినట్టే కన్పిస్తోంది.