దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. భారత్‌లో నిత్యం 80వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 67 లక్షలు దాటింది. ఈ క్రమంలో చలికాలం కూడా వచ్చేస్తోంది. అయితే చలికాలం నేపథ్యంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
అయితే ఉష్ణోగ్రతలను బట్టి కరోనా ప్రభావం ఎక్కువ, తక్కువ అనే విషయాలపై శాస్త్రీయంగా ఇప్పటి వరకు ఆధారాలు లేవని, కనుక చలికాలంలో కరోనా ప్రభావం పెరుగుతుందని కూడా చెప్పలేమని కొందరు సైంటిస్టులు అంటున్నారు. చలికాలంలో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్‌సైటియల్ వైరస్ తదితర వైరస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి. అయితే కరోనా కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.
ఇక శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయిన, 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంటే అది కరోనా వంటి వైరస్‌లకు ఎంతో అనుకూలమైన టెంపరేచర్ అని సైంటిస్టులు అంటున్నారు. చలికాలంలో సూర్య రశ్మి నుంచి అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని, కనుక కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, ఇప్పటి కన్నా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అంటున్నారు.