కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మనల్ని వదిలి వెళ్లి ఏడాది దాటింది. పునీత్ ఇంకా మన మధ్యే ఉన్నట్టు ఉంది. తన సినిమాల ద్వారా.. తాను చేసిన సేవా కార్యక్రమాల ద్వార అప్పు మన మనసులో చిరకాలం నిలిచిపోయాడు. ఇక కర్ణాటకలో అప్పు ఫ్యాన్‌బేస్ మామూలుగా ఉండదు. అప్పు కోసం ఏదైనా చేసేవారు కోకొల్లలు. ఈ జాబితాలో స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు.
తాజాగా.. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాము రూపొందించిన కేజీఎస్3 శాట్‌కు దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు. దీనిని ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సి54 వాహక నౌక ద్వారా పంపనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.